ఇండియా నుండి మొదటి ఇంటర్నేషనల్ పారా షూటర్లలో ఆమె ఒకరు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పదుల సంఖ్యలో పతకాలు సాధించారు. ప్రస్తుతం కఠిక పేదరికం అనుభవిస్తూ సాయం కోసం ఎదురు చూస్తోంది. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రోడ్డు పక్కన ఓ చిన్న బండి మీద చిప్స్ బిస్కట్ ప్యాకెట్ లు అమ్ముతూ జీవనం సాగిస్తోంది ఆ ఇంటర్నేషనల్ పారా షూటర్.
ఉత్తరాఖండ్ కు చెందిన దిల్ రాజ్ కౌర్ ఇండియా మొదటి అంతర్జాతీయ స్థాయి పారా షూటర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. 2005లో పారా షూటర్ గా ఎంటరైన ఆమె.. 2015 వరకు విజయవంతంగా కొనసాగారు. ఎన్నో జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రెండు డజన్లకు పైగా పతకాలు సాధించారు. అయితే ఆ పతకాలు ఆమె కష్టాలు తీర్చలేదు. ప్రభుత్వం ఆమెను పట్టించుకోలేదు. ఆర్థిక సాయం కానీ ఉద్యోగం ఇవ్వడం కానీ చేయలేదు. దీంతో.. ఒకప్పుడు దేశంలోనే గొప్ప పారా ఎయిర్ పిస్టల్ షూటర్ గా నిలిచిన ఆమె ప్రస్తుతం చిప్స్ అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తోంది.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి సాయం మద్దతు లభించలేదని దిల్ రాజ్ కౌర్ తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగానికి అప్లై చేసినా..ఫలితం లేకపోయిందన్నారు. ప్రస్తుతం అమ్మతో కలిసి ఓ అపార్ట్ మెంట్ లో రెంట్ కు ఉంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగాలేదని... రెంట్ చెల్లించడంతో పాటు.. మిగతా ఖర్చుల కోసం చిప్స్ బిస్కెట్లు అమ్ముకుంటున్నట్టు తెలిపారు.

